కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. భారత్ బంద్ లో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రాస్తారోకోలో ఆయన పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేసేందుకు ప్రధాని మోదీ కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ పాలిస్తున్న మధ్యప్రదేశ్ కూడా ఈ చట్టాలను వ్యతిరేకిస్తుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం దృష్ట్యా రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ఈ మూడు చట్టాలను కేంద్రం బేషరతుగా వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. రైతుల పోరాటానికి తెలంగాణ రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని పేర్కొన్నారు.