ప్రపంచ సంపన్ను జాబితాలో భారతీయ కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ స్థానం మరింత దిగజారింది. ప్రపంచ సంపన్నుల్లో 13వ వ్యక్తిగా నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. ఆయన ఆస్తి సుమారు రూ.6.62 లక్షల కోట్ల (90 బిలియన్ డాలర్లు) నుంచి రూ.5.36 లక్షల కోట్ల (73.4 బిలియన్ డాలర్లు)కు పడిపోయింది. గతేడాది ఆగస్టులో బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌లో ప్రపంచ సంపన్నుల్లో ముకేశ్ అంబానీ నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం.
గతేడాది మార్చిలో టెలికం, రిటైల్ రంగాల్లో వాటాల విక్రయంతో రిలయన్స్ షేర్ విలువ పెరిగడంతో ముకేశ్ సంపద అమాంతంగా పెరిగింది. ఇటీవల ఫ్యూచర్స్ గ్రూప్ కొనుగోలు ఒప్పందాన్ని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సవాల్ చేయడంతో రిలయన్స్ పతనం మొదలైంది. దీంతో ఆల్ టైం హై రూ.2,369 నుంచి రిలయన్స్ షేర్ దాదాపు 18.3 శాతానికి పడిపోయింది. జాబితాలో ఎలాన్ మస్క్ 209 బిలియన్లు, జెఫ్ బెజోస్ 186 బిలియన్లు, బిల్ గేట్స్ 134 బిలియన్ డాలర్ల సంపదతో తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.