రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరిలో స్ఫూర్తిని కలిగిస్తున్నది. ఇందులో భాగంగా బుధవారం తన నివాసంలో అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమ, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరుగుతోందన్నారు. తోటి పార్లమెంట్ సభ్యుడు సంతోష్ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామిని కావాలనే ఉద్దేశంతో మొక్కలు నాటినట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రజల్లో మంచి చైతన్యం తీసుకు వస్తుందన్నారు. మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీకి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందం సభ్యులకు మద్దతుగా ఉండాలనే ఉద్దేశంతో మొక్కలను నాటానన్నారు. ప్రతి ఒక్కరు మద్దతు తెలుపుతూ.. బాధ్యతగా మొక్కలు నాటాలని, భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలంటే ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.