బుల్లితెర స్టార్ హీరో సుధీర్ జాతీయ స్థాయిలో అదరగొట్టేశాడు. జబర్దస్త్, ఢీ వంటి షోలతో పాటు.. ప్రత్యేక సందర్భాల్లో ఈవెంట్లలో కూడా తన టైమింగ్, కామెడీతో ఆకట్టుకునే సుధీర్ తన సత్తా, టాలెంట్ ను నిరూపించుకునే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడనే విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సుధీర్ 2020 సంవత్సరానికి గానూ.. బుల్లితెర ఉత్తమ ఎంటర్ టైనర్ విభాగంలో జాతీయ స్థాయిలో ఎంపికయ్యాడు. ఈ అవార్డుకు ఎంపికైన వారిలో తెలుగు నుంచి సుధీర్ ఒక్కడే కావడం విశేషం.
దేశవ్యాప్తంగా బుల్లితెర ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి గానూ.. అవార్డుల జాబితా ప్రకటించింది. ఇందులో తెలుగులో పాపులర్ డ్యాన్స్ షో ఢీ నుంచి ఉత్తమ ఎంటర్ టైనర్ విభాగంలో సుధీర్ ఎంపికయ్యాడు. హిందీలో కపిల్ శర్మ, తమిళంలో పుగజ్, బెంగాలీలో అభిర్ చటర్జీ, మరాఠీలో భాను కదమ్ అనే నటులు ఎంపికయ్యారు.