లీడర్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన దగ్గుబాటి రానా కథల ఎంపికలో జాగ్రత్తగా అడుగులు వేస్తూ.. తక్కువ సమయంలోనే తనలోని పరిపూర్ణ నటుడిని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాడు. పలు భాషలలో ప్రతిష్టాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ప్రస్తుతం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెలుగులో విరాట పర్వం సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ రోజు విడుదలైన ఈ చిత్రం టీజర్ లో రానా నక్సలైట్ లుక్ తో అదరగొట్టాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్, వీడియోతో విరాట పర్వం సినిమాపై రానా అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాలో రానా రవిశంకర్ అలియాన్ రవన్న అనే నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు.
1990లో జరిగిన యదార్ధ సంఘటనల నేపథ్యంతో ఈ సినిమాని తెరకెక్కించినట్టు దర్శకుడు వేణు తెలిపారు. ఈ సినిమాలో రానాతో జంటగా సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్లో.. ఈ దేశం ముందు ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది..సత్యాన్వేషణలో నెత్తురోడిన హృదయం అతనిది అంటూ సినిమాపై ఆసక్తి కలిగేలా టీజర్ ముగించారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.