అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి ముఖాముఖి అత్యంత ఆసక్తికరంగా కొనసాగింది. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ల మధ్య 6 అంశాలపై 90నిమిషాల పాటు చర్చ జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి నియామకం నుంచి మొదలు పెడితే ఆర్థిక వ్యవస్థ, ఒబామా కేర్ స్కీమ్, కరోనా కట్టడి, వర్ణవివక్ష, పర్యావరణం, బ్యాలెట్ విధానం లాంటి అంశాలపై ఇరువురు నేతలు వాదనలు వినిపించారు. ట్రంప్, బిడెన్ ల మధ్య సంధానకర్తగా క్రిస్ వాలెస్ వ్యవహరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టానికి ఒహియోలోని క్లీవ్‌లాండ్ విశ్వవిద్యాలయం వేదిక అయింది. వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ట్రంప్, బిడెన్ లు సూపర్ బౌల్ ఆఫ్ అమెరికన్ డెమోక్రసీ వేదికలో పలు అంశాలపై ప్రజలకు తమ అభిప్రాయాలను వెల్లడించారు. క్రిస్ వాలెస్ సంధానకర్తగా వ్యవహరించిన ఈ డిబెట్ లో కరోనా విజృంభణ, నల్లజాతీయుల నిరసనలు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్నిక, ఒబామా కేర్ వంటి అంశాలపై తమ వాదనలను వినిపించారు.
దేశంలో ఒబామా కేర్ పాలసీని ట్రంప్ నీరుగార్చరని ఆరోపించారు బిడెన్. ట్రంప్ విధానం వల్లే వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని మండిపడ్డారు. కరోనా కట్టడిలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. అయితే బిడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ఖండించారు. ఆరోగ్య బీమాను రద్దు చేయలేదని ..ప్రజలకు ఆరోగ్యసేవలను తక్కువ ధరలో అందించే ప్రయత్నం చేశామని స్పష్టం చేశారు. ప్రజలకు కరోనా విషయంలో మెరుగైన వైద్యం అందించామన్నారు. ఒబామా కేర్ పాలసీ నిర్వహణ అంతా సులువు కాదని, పెద్ద ఖర్చుతో కూడుకున్నదిగా చెప్పుకొచ్చారు ట్రంప్.
ట్రంప్‌కు ఆరోగ్య రంగంపై అవగాహన లేదన్నారు బిడెన్. నిధుల విడుదల జాప్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రణాళిక వ్యూహారచనలో వెనకబడ్డారని ఎద్దేవా చేశారు. బిడెన్ స్టేట్మెంట్ పై ఘాటుగా స్పందించారు ట్రంప్. డెమొక్రటిక్ పార్టీ 47 ఏళ్ల పాలనలో అగ్రరాజ్యానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. భారత్ సహా ఇతర దేశాల్లో కొవిడ్ వల్ల ఎంతమంది మృతిచెందారో బిడెన్‌కు తెలియదా అని ప్రశ్నించారు. ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఎంపిక విషయమై మాట్లాడిన ట్రంప్ ..జడ్జీలనియామకాల్లో తమ ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు.
ఇక రిపబ్లికన్ హయాంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందన్న బిడెన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు ట్రంప్. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని స్పష్టం చేశారు. దేశంలో 7లక్షలమందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామన్నారు. వర్ణవివక్షతను సంస్కరించే ప్రయత్నం చేస్తున్నామన్న ట్రంప్..శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గుర్తు చేశారు. బ్యాలెట్ విధానంలో మోసాలకు తావు లేదన్న బిడెన్ స్టేట్ మెంట్ పూర్తిగా తప్పన్నారు. బ్యాలెట్ విధానంలో అక్రమాలు జరిగే అవకాశం ఉందంటున్నారు.
మొత్తానికి ఇరువురు అధ్యక్ష అభ్యర్థుల మధ్య తొలి ముఖాముఖి చర్చ వాడివేడిగా కొనసాగింది. రెండో డిబెట్ అక్టోబరు 15న ఫ్లోరిడాలోని మియామిలో జరగనుండగా 22న టెన్నెసీలోని నష్విల్లేలో మూడో విడత చర్చలు జరుగనున్నాయి.