ఢిల్లీలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో బాంబు పేలడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమం జరుగుతున్న రాజ్ పథ్ సమీపాన 1.4 కిలోమీటర్ల దూరంలోనే పేలుడు సంభవించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడు ధాటికి ఘటనా స్థలంలో మూడు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ గాయాలు కాలేదు. పూలకుండీలో పేలుడు సంభవించినట్టుగా అధికారులు తెలిపారు. పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద భద్రత పెంచారు.
పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులతో మాట్లాడారు. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. రాయబార కార్యాలయానికి, దౌత్యవేత్తలకు పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. పేలుడు నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి భద్రత పెంచారు.
