దేశాధినేతపై సోషల్ మీడియాలో విమర్శలు చేసిన పాపానికి ఓ ఉద్యోగికి అక్కడి కోర్టు 43 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన థాయిలాండ్‌లో చోటుచేసుకుంది. థాయ్‌లాండ్‌లో రాచరిక పాలన ఉంది. ఎవరైనా రాజును విమర్శించడం అక్కడ నేరం. థాయ్‌లాండ్ శిక్షా స్మృతిలోని ఆర్టికల్ 112 ప్రకారం ఇలాంటి వాటిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఒక్కో విమర్శకు 3 నుంచి 15 ఏండ్ల వరకు కఠిన జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
ఆరేండ్ల కిందట మహిళా ఉద్యోగి అంచన్ (65) సోషల్ మీడియాలో ఆ దేశ రాజు మహా వజ్ర లాంగ్కోర్న్ ను విమర్శిస్తూ కామెంట్లు చేయడంతోపాటు ఆడియోను పంచుకున్నారు. 2015లో అంచన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నేరం చేసినట్టు నిర్థారణ కావటంతో బ్యాంకాక్ క్రిమినల్ కోర్టు ఆమెకు కఠిన శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
తొలుత 87 ఏళ్ల శిక్షణను విధించగా.. ఆమె తన నేరాన్ని అంగీకరించడంతో సగానికి తగ్గింది. అయితే దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉందని అంచన్ తరపు న్యాయవాది చెప్పారు. ఈ తీర్పుపై మానవహక్కుల సంఘాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలోనూ రాజుపై విమర్శలు చేసిన ఓ వ్యక్తికి 70 ఏండ్ల జైలు శిక్ష విధించారు. గత నవంబరు నుంచి ఇప్పటి వరకు 50 మందిని ఇటువంటి ఆరోపణలతోనే అరెస్ట్ చేయడం గమనార్హం.