రెండ్రోజులు స్నానం చేయకపోతేనే అదోలా ఉంటుంది చాలామందికి. మనకేమో గానీ మనచుట్టూ ఉండే వాళ్లకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒక వ్యక్తి 65ఏళ్లుగా స్నానం చేయట్లేదట.

ఇరాన్ దెజ్ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ గత 65 ఏళ్లుగా స్నానం చేయడం మానేశాడు. ఇప్పుడతనికి 83 ఏళ్లు. అయినా ఈ వయసులోనూ అతను చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. హాజీకి ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతను రోజూ స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని భావించి..అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడు. అంతేకాదు ఇతను తినేదంతా నాన్ వెజ్జే. అడవి పంది మాంసం అంటే తనకెంతో ఇష్టమని చెప్తుంటాడు. ఆఖరికి కుళ్లిపోయిన మాంసాన్ని కూడా ఇష్టంగా ఆరగించేస్తాడు. రోజుకు అయిదు లీటర్ల నీటిని తాగుతాడు. అంతేకాకుండా తనకు పొగతాడటం అంటే చాలా ఇష్టమని, సిగరెట్ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగుతానని చెప్తున్నాడు.

ఊరి బయట ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి గ్రామస్తులే భోజనం పెడుతుంటారు. 65ఏళ్లుగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాడని, ఇంత మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం ఆశ్చర్యంగా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు.