అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రెసిడెంట్ డోనల్డ్ ట్రంప్ మద్దతుదారులు చేసిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు అమెరికా పార్లమెంటు ‘క్యాపిటల్’ భవనంలోకి దూసుకెళ్లడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు ఫైరింగ్ చేశారు. ఈ హింసాత్మక అల్లర్లలో నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 52 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.
పార్లమెంటు భవనంలోకి ఆందోళనకారులు రావడంతో కాంగ్రెస్ సభ్యులు బల్లల కింద దాక్కున్నారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. దీంతో కాంగ్రెస్ సభ్యలు కొందరు గ్యాస్ మాస్కులు ధరించారు. క్యాపిటల్ భవనంలో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్రంప్ మద్దతుదారుల ఆందోళన నేపథ్యంలో అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో జనవరి 21 వరకు ఎమర్జెన్సీని పొడిగిస్తున్నట్లు నగర మేయర్ మురియెల్ బౌజర్ ప్రకటించారు.
అల్లర్లు, హింస బాధాకరం.. నరేంద్ర మోదీ
అమెరికా పార్లమెంటు ముట్టడిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. “వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న అల్లర్లు, హింస బాధాకరం. అధికార బదిలీ చట్టబద్ధంగా, శాంతియుతంగా జరగాలి. చట్టవిరుద్ధమైన నిరసనల ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియను అణచివేయడాన్ని సమ్మతించలేం” అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.