29.5 C
Hyderabad
Wednesday, March 3, 2021

రాకేష్ టికాయత్@ రైతు ఉద్యమం

కేంద్రం అమలు చేయాలనుకుంటున్న మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమం గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అయితే.. ఈ ఉద్యమంలో ఒక రైతు నాయకుడి పేరు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోతోంది. ఢిల్లీలో రైతు ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న ఆ రైతు నాయకుడి పేరు రాకేష్ టికాయత్. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘాల్లో ఒకటైన బీకేయూ నేత.


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాకేష్ టికాయత్ ఉద్యమాన్ని ఓ క్రమపద్ధతిలో, సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతాని రైతులంతా నమ్ముతున్నారంటే ఆయన సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది. సాగు చట్టాల్ని రద్దు చేయాలని రైతుల తరపున రైతువాణిని కేంద్రానికి గట్టిగా వినిపిస్తున్న వారిలో ముఖ్యుడు. యూపీలోని ముజఫర్ నగర్ జిల్లా సిసౌలీ గ్రామంలో రాకేష్ టికాయత్ 1969 జూన్ 4న పుట్టారు. మీరట్ యూనివర్శిటీలో ఎంఏ ఎల్ఎల్బీ చదివారు. ఆయన తండ్రి మహేంద్రసింగ్ టికాయత్ రైతు నాయకుడు. 1990 కాలంలో లక్షలాది మంది రైతులు కలిసి చేసిన ఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి నాయకత్వం వహించిన వారిలో మహేంద్రసింగ్ టికాయత్ ఒకరు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను సంఘటిత పరిచి.. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలపై ఉద్యమాలు నిర్మించి రైతు పోరాటాలు నడిపించిన అనుభవం ఉన్న వ్యక్తి.


తండ్రి స్ఫూర్తితో రైతు ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న రాకేష్ టికాయత్ అంతకు ముందు ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్సైగా పనిచేశారు. తండ్రి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల రాకేష్ మీద తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం కంటే.. ఉద్యమమే గొప్పదని ఉద్యోగానికి రాజీనామా చేశారు. రైతు సంఘంలో చేరి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం సాగు చట్టాల మీద పోరాడుతున్న రైతు సంఘాల్లో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) ఒకటి. ఈ సంఘానికి రాకేష్ టికాయత్ జాతీయ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అన్న నరేష్ టికాయత్ బీకేయూ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు.


రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్‌ టికాయిత్‌ గతంలో రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేశారు. 2007లో ముజఫర్‌నగర్‌లోని ఖటౌలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో అమ్రోహ నుంచి లోక్‌సభకు ఆర్‌ఎల్డీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం 60 రోజులుగా విరామం లేకుండా ఢిల్లీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో కీలకంగా మారారు. రైతులతో పాటే ఉంటూ.. వారిని ఉత్తేజపరుస్తూ ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు ఢిల్లీ వదిలి పోమంటున్నారు.

- Advertisement -

Latest news

Related news