విడాకులు తీసుకుంటాం, విడిపోతాం అంటే ఎవరైనా వద్దని అంటారు. కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేస్తారు. కానీ ఓ సంస్థ మాత్రం డిఫరెంట్ గా .. ఉచితంగా విడాకులిస్తాం అంటోంది.
వాలంటైన్స్ డే రోజు సింగిల్స్.. జంటగా మారాలనుకుంటారు. వాలంటైన్స్ డే రోజు ప్రపోజ్ చేసి తమ ప్రేమను తెలపాలనుకుంటారు. కానీ అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో క్రాస్విల్లేలో ఉన్న పవర్స్ లా ఫర్మ్ కంపెనీ మాత్రం వెరైటీగా.. వాలంటైన్స్ డే రోజు ఓ లక్కీ కపుల్‌కి ఫ్రీగా విడాకులు ఇప్పిస్తామని ప్రకటించింది.
ఈ ఆఫర్ గురించి మాట్లాడుతూ.. “వాలెంటైన్స్ డే లాంటి పిచ్చి సంస్కృతి వల్ల మనిషి తన ఫైనాన్షియల్ పరిస్థితులు ఆలోచించకుండా.. ప్రేమలు, పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొలేక లేదా వేరే కారణాల వల్ల విడిపోవాలనుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకరిని సెలక్ట్ చేసి ఉచితంగా విడాకులు ఇప్పిస్తాం. పైగా మనదేశంలో విడాకులు తీసుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. చాలా మంది దీన్ని భరించలేరు కూడా. అందుకే ఈ వాలంటైన్స్ డే రోజు ఒక లక్కీ కపుల్‌ని సెలక్ట్ చేసి.. వారి విడాకుల కోసం ఉచితంగా లీగల్ సర్వీస్ చేస్తామని, కోర్టు ఫీజు కూడా తీసుకోం” అని తెలిపింది.
ఈ ఆఫర్ కేవలం టెన్నెస్సీలో ఉన్నవాళ్లకు మాత్రమే. ఫ్రీగా డైవర్స్ కావాలనుకున్న వాళ్లు.. తాము ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో మెయిల్ చేయాలి. అలాగే భార్యభర్తలిద్దరు చట్టపరంగా విడాకులకు సిద్ధంగా ఉండాలి, సంతానం ఉండకూడదు అని వెల్లడించింది. విన్నర్‌ని ఫిబ్రవరి 19న ప్రకటిస్తామని చెప్పింది.