అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా పదవి చేపట్టబోతున్న కమలా హ్యారిస్.., అమెరికాకు తొలి మహిళా వైస్ ప్రెసిడెంట్, అందులోనూ తొలి ఆసియా మహిళ కావడంతో ఆమె ప్రమాణ స్వీకారానికి ఎలా హాజరవుతారా అన్న చర్చ జరుగుతోంది. ఆమె భారతీయ మూలాలున్న వ్యక్తి కాబట్టి స్వీకారోత్సవానికి చీరకట్టులో వస్తారా? సూట్లో వస్తారా? అనే టాపిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
వైస్–ప్రెసిడెంట్ అవుతున్న తొలి మహిళ కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమానికి ఎలాంటి దుస్తులను ధరిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అమెరికన్ పౌరురాలిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించేలా ప్యాంట్ సూట్లో వేసుకుంటారా? లేదా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చీరకట్టుతో వస్తారా? అని అందరూ చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా కమలా చీర ధరించి ఉన్న ఫ్యామిలీ ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూశాక అమెరికాలోని దక్షిణాసియా ప్రజలు, ఇండియన్స్ ప్రమాణ స్వీకారంలో ఆమెను చీరతోనే చూడాలని ఆశపడుతున్నారు.

కానీ అంతకుముందు ఒక సందర్భంలో కమలా మాట్లాడుతూ.. “మన పేరు పక్కన ఉన్న ఇంటి పేరుని బట్టి కాదు, మనం ఉన్న దేశాన్ని బట్టి అందరం కలిసి వేడుకల్లో పాల్గొనాలి” అన్నారు. దాన్ని బట్టి చూస్తే..ఇవాళ కమలా హ్యారిస్‌ను మనం ప్యాంట్ సూట్‌లోనే చూడొచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి.