17 C
Hyderabad
Monday, March 1, 2021

అమెరికా అధ్యక్షుడి స్పీచ్ డైరెక్టర్ మనోడే..

అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ టీంలో కరీంనగర్ జిల్లాకు చెందిన వినయ్ రెడ్డికి చోటు దక్కింది. జిల్లాలోని హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్ రెడ్డి బైడెన్ టీంలో ఉండటం పట్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినయ్ రెడ్డి తాత తిరుపతిరెడ్డి పోతిరెడ్డిపేట గ్రామానికి 30 ఏళ్లు సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వినయ్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నారాయణరెడ్డి ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు.

వినయ్ రెడ్డి అమెరికాలో లా కంప్లీట్ చేసి యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచ్ రైటర్ గా పనిచేశారు. 2012 అమెరికా ఎన్నికల్లో ఒబామా, బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో బైడెన్, కమలా హారిస్ లకు స్పీచ్ రైటర్ తో పాటు ట్రాన్స్ లేటర్ గా పనిచేశారు. ఇప్పుడు వైట్ హౌజ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ జిల్లా పేరు అమెరికాలో మార్మోగేలా చేశారు. నారాయణరెడ్డి కుటుంబం స్వగ్రామమైన పోతిరెడ్డిపేటలో పలు కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించేవారు. ఆ ఊరికి చెందిన నారాయణరెడ్డి కుమారుడు వినయ్ రెడ్డి.. బైడెన్ టీంలో వైట్ హౌజ్ డైరెక్టర్ గా నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. వినయ్ రెడ్డి వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Latest news

Related news