బీసీసీఐ ప్రెసిడెంట్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఈసీజీ రిపోర్టులో స్వల్ప మార్పులు కనిపించాయని.. డాక్టర్ల బృందం మరోసారి రెండో యాంజియోప్లాస్టీపై నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. గురువారం రోజు దాదా గుండెలో మరో స్టంటు అమర్చే అవకాశం ఉందంటున్నారు వైద్యులు.
గతంలోనే గుండెనొప్పితో బాధపడిన దాదా రక్తనాళాల్లో డాక్టర్లు మూడు పూడికలను గుర్తించారు. ఒక దాంట్లో స్టంట్ అమర్చగా.. ఆ తర్వాత ఆరోగ్యంగా కనిపించడంతో.. రెండో స్టంట్ ను వాయిదా వేశారు. గంగూలీ అసౌకర్యంగా ఉన్నారని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో హుటాహుటిన కోల్కతాలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. సీసీయూ 142 యూనిట్లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. గంగూలీ ఈసీజీ నివేదికలో స్వల్ప మార్పులు గుర్తించారట.
