విమానంలో 59 మంది ప్రయాణికులు
టేకాఫ్ అయిన నిమిషాలకే రాడార్ తో తెగిన సిగ్నల్
ఇండోనేషియాలో శ్రీవిజయ సంస్థకు చెందిన ప్యాసింజర్ ఫ్లైట్ బోయింగ్-737 అదృశ్యమైంది. అదృశ్యమైన విమానంలో ఐదుగురు చిన్నారులు సహా 59 మంది ప్రయాణికులు ఉన్నారని ఇండోనేషియా అధికారులు తెలిపారు. విమానం జకర్తా నుంచి బోర్నియో ఐలాండ్‌లోని పోన్‌టియానక్‌కు వెళ్తూ అదృశ్యమైందని ఇండోనేషియా ట్రాన్స్‌పోర్టు మినిస్ట్రీ వెల్లడించింది. రాడార్ సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్టు ఇండోనేషియా రవాణా మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అదిత ఇరావతి తెలిపారు.
నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ పరస్పర సమన్వయం చేసుకుంటూ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయన్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.40 గంటలకు విమానంతో రాడార్‌కు సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. అదృశ్యమైన సమయంలో విమానం 10 వేల అడుగుల ఎత్తులో ఉందని, టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే సంబంధాలు తెగిపోయాయన్నారు.
ఇండోనేషియాలోని పశ్చిమ కలిమంటన్ ప్రావిన్స్‌లోని పోంటియానక్‌కు బయల్దేరిన ఈ బోయింగ్ 737-500 విమానం 27 ఏళ్ల నాటిదిగా గుర్తించారు. 2018 అక్టోబర్ 29న ఇండోనేషియాలోని లయన్ ఎయిర్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానం జకార్తాలో టేకాఫ్ అయిన 12 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో విషాదం నింపిన విషయం తెలిసిందే.