పార్టీ జెండాలు పక్కనపెట్టి రైతు ఎజెండానే తమ జెండాగా రాజకీయ పార్టీలు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ సూపర్ సక్సెస్ అయ్యింది. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు స్వచ్చంధంగా బంద్ కు మద్దతు తెలిపాయి. వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని రైతులు చేపట్టిన బంద్ లో పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, కేరళ, ఝార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రజలు, అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు బంద్ లో పాల్గొన్నారు. డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలు, శివసేన, అకాళీదల్, టీఆర్ఎస్, ఎస్పీ, బీఎస్పీ, జేడీఎస్, ఎన్సీపీ, ఎస్ఏడీ, పీడీపీ పార్టీల నేతలు, కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు.కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలంటూ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించాయి. ఈ బంద్కు దేశవ్యాప్తంగా 25 రాజకీయ పార్టీలతోపాటు వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు తమ మద్దతు ప్రకటించి బంద్ లో పాల్గొన్నాయి. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు, కేంద్రం మధ్య ఐదుసార్లు చర్చలు జరిగినా సమస్యకు పరిష్కారం తేలకపోవడంతో రైతు సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి.
రాజకీయ పార్టీలు బంద్ కు మద్దతిచ్చినప్పటికీ పార్టీ జెండాలు, అజెండాలను పక్కనబెట్టి తమకు ప్రతిబింబమైన ఆకుపచ్చ జెండాలతోనే రావాలని రైతు సంఘాల నేతలు కోరారు. ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా బంద్ నిర్వహించారు. కార్మిక, ఉద్యోగ, వ్యాపార సంఘాలు సైతం బంద్ కు స్వచ్ఛంధంగా మద్దతివ్వడంతో వ్యాపార సముదాయాలు, ఇతర కార్యక్రమాలు నిలిచిపోయాయి. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తాము ఉంటున్న చోట్లే నిరసనలు వ్యక్తం చేస్తూ బంద్కు మద్దతిచ్చారు. దీంతో రైతుల ఆందోళన అంతర్జాతీయ రూపు సంతరించుకుంది.