జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగే ఈ భారీ బహిరంగసభకు ఎల్బీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచనల మేరకు గులాబీ పార్టీ నేతలు, క్యాడర్.. దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే భారీ బహిరంగసభకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రతి నియోజకవర్గం నుంచి జనం వేలాదిగా తరలి రానున్నారు. మొత్తం 150 డివిజన్లలో… ప్రతి డివిజన్ నుంచి భారీ ఎత్తున జనాన్ని తరలించి, మహానగరంలో టీఆర్ఎస్ కు తిరుగులేదని చాటిచెప్పేందుకు గులాబీదళం సిద్ధమైంది. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ఎల్బీ స్టేడియానికి క్యూ కట్టనున్నారు. ఆ దిశగా ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏర్పాట్లు చేశారు.
కరోనా నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడంతో సభా ప్రాంగణంలో శానిటైజేషన్ చేస్తున్నారు. ఎల్బీ స్టేడియానికి వచ్చే రూట్లను బట్టి ప్రత్యేక గేట్లను ఏర్పాటు చేశారు. నేతలు, కార్యకర్తలు, ప్రజలకు ఆ గేట్ల నుంచే లోపలికి ఎంట్రీ ఉంటుంది. నగరం నలుమూలల నుండి వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.
ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆరేళ్లలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించనున్నారు. భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాల గురించి కూడా చెప్పనున్నారు. టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో గురించి కూలంకశంగా ప్రజలకు వివరించి, దిశానిర్దేశం చేయయనున్నారు.
మొత్తంగా గ్రేటర్ ఎన్నికల ముంగిట సీఎం కేసీఆర్ హాజరు కానున్న ఈ బహిరంగసభను టీఆర్ఎస్ కీలకంగా భావిస్తోంది. అందుకే టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నారు. బహిరంగసభను దిగ్విజయం చేసి, హైదరాబాద్ గులాబీ అడ్డా అనిచాటిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి ఎల్బీ స్టేడియానికి జనం ఉప్పెనలా పోటెత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనమంతా ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.