పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఉన్నట్టుండి ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రజలు అకారణంగా అనారోగ్యానికి గురికావడానికి గల కారణాలను గుర్తించే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), నేషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ నిపుణుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. సోమవారం ఉదయం వరకు ఏలూరు ప్రభుత్వ దవాఖానలో 340 కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో చేరిన వారిలో 45 ఏళ్ల వ్యక్తి ఒకరు మరణించగా.. 168 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 157 మంది చికిత్స పొందుతున్నారు. 14 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడలోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అయితే ఈ అంతుచిక్కని వ్యాధి ఒకరినుంచి మరొకరికి సోకలేదని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ఘటనకు ఏలూరు మున్సిపాలిటీ పంపిణీ చేసిన మంచినీళ్లే కారణమని భావిస్తుండగా.. ఆ నీళ్లు తాగని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కూడా అనారోగ్యానికి గురయ్యారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఏలూరు ప్రభుత్వ దవాఖానను సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ధైర్యం చెప్పారు. అధికారులతో జరిపిన సమీక్షలో.. అనారోగ్యానికి దారితీసిన పరిస్థితులు, పరీక్షలు, నీటి టెస్టులు, రక్త నమూనాల ఫలితాలు వెంటనే తెలుసుకోవాలని ఆదేశించారు. కాగా పరీక్షల్లో నీటి నమూనాలు సాధారణంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రక్త పరీక్షలు, సిటీస్కాన్ రిపోర్టులు సీఎంకి నివేదించారు. ఏలూరు పట్టణం, గ్రామీణ, దుందులూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఎయిమ్స్ నిపుణుల బృందం ఏలూరు దవాఖానను సందర్శించి రోగులను పరీక్షించి నమూనాలను సేకరించారు. అనారోగ్యానికి గల కారణాలపై మరింత దర్యాప్తు చేసేందుకు ఐఐసీటీ, సీఎంఆర్ నిపుణులు రానున్నట్లు వివరించారు. పరిస్థితి అదుపులోనే ఉందని ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ తెలిపారు.