21.4 C
Hyderabad
Friday, December 4, 2020

కరోనా సంక్షోభకాలంలోనూ తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ

కరోనా కష్ట కాలంలో సైతం..ప్రపంచ పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ఆశాకిరణంలా మారింది. రాష్ర్టానికి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్నది. ఇక్కడికి బడా కంపెనీలు క్యూ కడుతున్నాయి. టీఎస్‌ఐపాస్‌, సులభ వాణిజ్య విధానంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం, మానవవనరుల లభ్యతవంటి అనేకఅంశాలు దోహదం చేస్తున్నాయి. ఇటీవలే రెండు ప్రపంచస్థాయి కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో 2,500 కోట్లకుపైగా పెట్టుబడులు పెడుతామని ప్రకటించారు. మరో రెండు కంపెనీలు ఇప్పటికే 2వేల 50కోట్ల పెట్టుబడులను ప్రకటించాయి. మరికొన్ని చర్చలు జరుపుతున్నాయి. గతంలోనే ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు విస్తరణను కొనసాగిస్తున్నాయి.  

అగ్రరాజ్యం అమెరికాలో ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీలు రెండో అతిపెద్ద క్యాంపస్‌ల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే కేంద్రంగా ఎంచుకున్నాయి. గూగుల్‌, క్వాల్‌ కమ్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, నొవార్టిస్‌, మెడ్‌ట్రానిక్స్‌  తదితర సంస్థలు ఇక్కడ తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి. తెలంగాణలోని పారిశ్రామిక అనుకూల విధానాలు, స్థిరమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు తమ యూనిట్లను స్థాపించడానికి కారణాలని ఆ సంస్థల ప్రతినిధులే స్వయంగా ప్రకటించారు. లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నొవార్టిస్‌ దాదాపు ఆరువేల మందితో హైదరాబాద్‌ లో యూనిట్‌ను స్థాపించింది. విస్తరించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, ప్రాక్టర్‌ అండ్‌ గాంబుల్‌, ఐకియా, వాల్‌మార్ట్‌ లాంటి ప్రపంచస్థాయి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి.

టీఎస్‌ఐపాస్‌ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. దీనిద్వారా 12,994 పరిశ్రమలు అనుమతి పొందాయి. 10,338 పరిశ్రమలు 80 శాతం ఉత్పత్తులను ప్రారంభించాయి. 14.36 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానుండగా.. ఇప్పటికే 7.31 లక్షల మందికి పని కల్పించాయి. రాష్ర్టానికి వచ్చే భారీ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా సీఎంవోలో చేజింగ్‌ సెల్‌ ను ఏర్పాటు చేశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాకు అత్యధిక పరిశ్రమలు రాగా, పెట్టుబడులపరంగా, ఉద్యోగావకాశాల పరంగా రంగారెడ్డి తొలిస్థానంలో నిలిచింది.

ఏస్టర్‌  ఫిల్మ్‌ టెక్‌  లిమిటెడ్‌ సంస్థ ప్యాకేజింగ్‌  ఫిల్మ్‌ మాన్యుఫాక్చరింగ్‌  ప్లాంట్‌ ను తెలంగాణలో ఏర్పాటుచేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. 1350 కోట్ల పెట్టుబడితో కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ చైర్మన్‌ అరవింద్‌ సింఘనియా స్వయంగా ప్రకటించారు. చందన్‌ వెల్లి పారిశ్రామికవాడలో త్వరలో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించనున్నది. తొలిదశ కంపెనీ నిర్మాణం కోసం 500 కోట్లు ఖర్చు చేయనుండగా.. 2022 సెప్టెంబర్‌  నాటికి పనులు పూర్తి కానున్నాయి. దీనిద్వారా స్థానికంగా 800 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వైద్య పరికరాల తయారీలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ మెడ్‌ ట్రానిక్స్‌ తన పెట్టుబడులకు స్థావరంగా తెలంగాణను ఎంచుకున్నది. అమెరికా అవతల తన రెండో అతిపెద్ద డెవలప్‌ మెంట్‌ కేంద్రాన్ని హైదరాబాద్‌ లో ఏర్పాటు చేసేందుకు 1200కోట్లు వెచ్చిస్తున్నది. సంస్థ ప్రస్తుత పరిశోధన, అభివృద్ధికేంద్రాన్ని మరింత విస్తరించనున్నది. 

శంకర్‌ పల్లి మండలం కొండకల్‌ లో 11 వందల కోట్ల పెట్టుబడితో మేధా రైల్‌కోచ్‌ ఫ్యాక్టరీ పనులకు ఇటీవలే మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రైవేటు రంగంలో అతిపెద్ద రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఇదే. దీనిద్వారా 2200మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. లోకోమోటివ్స్‌, కోచ్‌ లు ఇక్కడ తయారు చేస్తారు. దీనిద్వారా భవిష్యత్‌లో రైల్వేకోచ్‌ లు, ఇతర పరికరాల కంపెనీలు వచ్చే అవకాశం ఉంది.  నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 500 కోట్లతో తమ డాటాను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. 

జీనోమ్‌ వ్యాలీలో 400 కోట్లతో ప్రపంచస్థాయి సంస్థ సాయి లైఫ్‌ సైన్సెస్‌ పరిశోధన, టెక్నాలజీ యూనిట్‌ ను ప్రారంభించింది. పరిశోధన అభివృద్ధి సెంటర్‌ ఇప్పటికే జీనోమ్‌ వ్యాలీలో ఉంది. దానికి అనుబంధంగా 83వేల చదరపు అడుగుల్లో పరిశోధన, టెక్నాలజీ సెంటర్‌ ను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్‌ లో ఇంటెలిజెంట్‌ ల్యాబ్‌ డిజైన్‌, శాటిలైట్‌ అనటికల్‌ టెస్టింగ్‌, ప్రాసెస్‌ సేఫ్టీల్యాబ్‌ తదితర ముఖ్యమైన పరిశోధన ల్యాబ్‌లు ఉన్నాయి. సాయిలైఫ్‌ సైన్సెస్‌ ప్రపంచంలోని పది అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఏడింటితో కలిసి పనిచేస్తున్నది. ఈ కంపెనీకి అమెరికా, యూకేల్లో పరిశోధన, అభివృద్ధి కార్యాలయాలు ఉండగా తాజాగా హైదరాబాద్‌ లో ఏర్పాటు చేశారు. 2025 నాటికి ప్రపంచంలోని ప్రముఖకంపెనీలకు 25 కొత్త ఔషధాలను కనుగొనడానికి ఈ కంపెనీ తోడ్పాటునివ్వనున్నది.

ప్రభుత్వం అవలంబిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బడా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...