నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన శనివారం కూడా కొనసాగుతున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజధానిలోనే బైఠాయిస్తామని రైతులు మొండికేస్తున్నారు. బురారీలోని నిరంకారీ మైదానంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతించినా.. పంజాబ్, హర్యానాలకు చెందిన రైతులు సింఘులో ఇంకా నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. అక్కడే బైఠాయించి.. ఆందోళన కొనసాగిస్తామని తెగేసి చెప్పారు.

పంజాబ్ నుంచి ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం వల్ల వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైతులతో పోలీసులు చర్చలు కొనసాగిస్తున్నా.. రైతులు మాత్రం మెట్టు దిగడం లేదు. రోడ్లపైనై.. వంటావార్పు కార్యక్రమం నిర్వహించి.. శుక్రవారం రాత్రంతా రైతులు తమ నిరసన కొనసాగించారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన టిక్రీలో శనివారం భారీస్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ నుంచి నిరంకారీ మైదానానికి 30 మంది రైతులు చేరుకున్నారు.
మధ్యాహ్నానికి మరికొన్ని రాష్ట్రాల నుంచి భారీగా రైతులు ఆందోళనలో పాల్గొనే అవకాశం ఉంది. డిసెంబర్ 3న రైతులతో చర్చలు చేపట్టేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని.. అప్పటి వరకు రైతులు ఆందోళన విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కోరగా.. రైతులు మాత్రం.. చర్చలు సఫలమై.. చట్టాలను వెనక్కి తీసుకుంటేనే ఆందోళన విరమిస్తామని మొండికేస్తున్నారు.