కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ఆన్ లైన్ భేటీలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నరు. జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నదని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్ 1-2 ప్రకారం రాష్ర్టాలకు ప్రతి రెండు నెలలకు ఒకసారి పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. సెస్సుతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సిఫారసుచేసే ఇతర నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమచేయాలన్నరు. రాష్ర్టాలకు అందించే పరిహారం ఈ నిధి నుంచే చెల్లించాలని చట్టం స్పష్టంగా చెప్తున్నదని గుర్తుచేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆప్షన్-1, ఆప్షన్-2 రూపంలో రాష్ర్టాలపై రుణభారం మోపడం చట్ట విరుద్ధమన్నారు.
కేంద్రం గతంలో ఇచ్చిన ఆప్షన్-1 ప్రకారం.. రాష్ర్టాలకు తగ్గుతున్న ఆదాయాన్ని రూ.97 వేల కోట్లుగా అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ప్రత్యేక విండో ద్వారా రాష్ర్టాలకు రుణం రూపంలో అందిస్తామని, అసలు, వడ్డీని కేంద్రమే కడుతుందని తెలిపింది. ఆప్షన్-2 కింద ఆదాయ నష్టం, కరోనా వల్ల కలిగిన నష్టాన్ని రూ.2.35 లక్షల కోట్లుగా లెక్కవేసి, మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవాలని సూచించింది. వడ్డీ భారం రాష్ర్టాలు మోయాల్సి ఉంటుంది. అయితే తాజాగా 97 వేల కోట్లను రూ.1.1 లక్షల కోట్లుగా, రూ.2.35 లక్షల కోట్లను రూ.1.83 లక్షల కోట్లుగా మార్చింది. దీనిపై మంత్రి హరీశ్ స్పందిస్తూ.. రెండింటి మధ్య అంతరం రూ.73 వేల కోట్లేనని చెప్పారు. ఇది కేంద్రానికి పెద్దమొత్తం కాదని, కాబట్టి 73 వేల కోట్లు కూడా కలిపి మొత్తం 1.83 లక్షల కోట్లను రాష్ర్టాలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం మాత్రం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే ఇస్తామని, దానిని రాష్ర్టాలు రుణం రూపంలో తెచ్చుకోవాలని చెప్తూ సమావేశాన్ని ముగించింది.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాను 15వ ఆర్థిక సంఘం 2.43% నుంచి 2.13 శాతానికి తగ్గించడం వల్ల రాష్ర్టానికి నష్టం జరుగుతున్నదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. కేంద్రం తాజా ప్యాకేజీలో ఈ సిఫారసులను పరిగణనలోకి తీసుకోవడంతో తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పెద్ద రాష్ర్టాలకు నష్టం కలుగుతున్నదని చెప్పారు. డెవల్యూషన్ గ్రాంట్‌ను తగ్గించడం వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి 723 కోట్లు వన్ టైం గ్రాంట్ కింద ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని గుర్తుచేశారు. కేంద్రం వెంటనే ఈ ప్రతిపాదనను ఆమోదించి, నిధులు విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు..