17.7 C
Hyderabad
Wednesday, November 25, 2020

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం.. స్థలం అప్పగింత

దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. టీఆర్ఎస్ ఆఫీసు కోసం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ కేటాయించిన 1100 చదరపు మీటర్ల భూమి అప్పగింత పని పూర్తయింది. వసంత్‌ విహార్‌లోని 2, 6 నంబర్లలోని ప్లాట్ల పత్రాలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ ల్యాండ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌ జేఈ సుమిత్‌ కుమార్‌.. టీఆర్‌ఎస్‌ ప్రతినిధి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. 15 మంది ఎంపీల కంటే ఎక్కువగా ఉన్న పార్టీలకు.. ఢిల్లీలో కార్యాలయాల నిర్మాణానికి 1000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ  స్థలాన్ని కేటాయిస్తారు. ఈక్రమంలోనే పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని కేటాయించాలని  కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్‌ కోరడంతో గత అక్ట్టోబర్‌ 9న స్థలాన్ని కేటాయిస్తూ సమాచారమిచ్చింది. కేంద్రం నిర్దేశించిన మేరకు రూ.8.64 కోట్లు పార్టీ నిధుల నుంచి చెల్లించడంతో హద్దులను చూపించి స్థలాన్ని అప్పగించారు.  ఈ స్థలాన్ని వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పలువురు పార్టీ నేతలు భూమిని పరిశీలించారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగానే… ఢిల్లీలో కార్యాలయం నిర్మించుకునే స్థాయికి టీఆర్‌ఎస్‌ ఎదిగిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఇది గర్వకారణమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణకు ప్రతీకగా హైదరాబాద్‌ హౌజ్ ఉండేది. ప్రతిష్టాత్మకమైన ఈ రాజప్రాసాదం తదనంతర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ హౌజ్‌ ఆనాటి చరిత్రకు నిలువుటద్దమైతే.. ఇప్పుడు కొలువుదీరబోయే తెలంగాణ భవన్‌ మన ఆత్మగౌరవానికి ప్రతీక కాబోతోంది. తెలంగాణ పోరాటానికి.. కలల సాకారానికి సంకేతంగా నిలవబోతోంది. ఢిల్లీలో వెలిసే తెలంగాణ భవన్‌ ఈ దేశఅస్తిత్వ పోరాటాలకు కరదీపికగా మారబోతోంది.

జలదృశ్యంలో ఒక వ్యక్తి నడకతో మొదలైన టీఆర్‌ఎస్‌ ప్రస్థానం ప్రత్యేక తెలంగాణ పోరాటంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. టీఆర్‌ఎస్‌ తన పోరాటపటిమతో కేంద్రం మెడలు వంచి అసాధ్యమనుకొన్న తెలంగాణను సుసాధ్యం చేసింది. ఇప్పుడు  దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాజకీయ ఆత్మగౌరవ జెండాను రెపరెపలాడించేందుకు సిద్ధమైంది. తెలంగాణకు నవ వసంతాలు మోసుకొచ్చిన గులాబీ జెండా ఢిల్లీలో వినువీధిలో ఎగురనున్నది. టీఆర్ఎస్రాజకీయ ప్రస్థానంలో ఇది మరో మైలురాయి. తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి. 

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...