వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలంటూ ఢిల్లీలో వరుసగా 13వ రోజు రైతులు చేస్తున్న ఆందోళనలో విషాదం చోటు చేసుకుంది. ఆందోళనలో పాల్గొంటున్న యువరైతు మృతి చెందడం కలకలం రేపింది.
బరోడా సోనిపట్ కు చెందిన 32 ఏండ్ల అజయ్ అనే యువరైతు టిక్రీ బార్డర్ లో రైతుల ఆందోళనల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సోమవారం రాత్రి టీడీఐ పార్కులో ఆరుబయట నిద్రపోయిన అజయ్ చలిని తట్టుకోలేక ప్రాణాలు విడిచాడు. ఈరోజు ఉదయం నిర్జీవంగా పడి ఉన్న అజయ్ ని గమనించిన పోలీసులు పరీక్షించి చనిపోయాడని నిర్ధారించి.. పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.