వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల ఆందోళన 14వ రోజుకు చేరింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తిరస్కరిస్తూ.. ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నట్టు ప్రకటించారు.
వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస్తామని కేంద్రప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకొని తమ కార్యాచరణ ప్రకటించారు.
ఈ నెల 12న ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధించాలని రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. డిసెంబర్ 14న దేశంలోని అన్ని బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని, బీజేపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలను ఘోరావ్ చేస్తామని ప్రకటించారు. రహదారుల దిగ్బంధనం కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీకి తరలి రావాలని రైతు సంఘాల నేతలు కోరారు.