గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మళ్లీ కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లులు పడ్డట్లు కురిసిన హోరు వానతో నగరం అతలాకుతలమైంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో క్యుములోనింబస్ మేఘాలు కుమ్మేయడంతో నగరం నిండా మునిగింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, అల్వాల్, తార్నాక, ఉప్పల్, నాచారం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కర్మన్‌ఘాట్, మలక్‌పేట, చార్మినార్, జూపార్క్, జియగూడ, లంగర్‌హౌస్, మెహిదీపట్నం, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, పటాన్చెరు, కూకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మూడు గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఆసిఫ్‌నగర్‌లో 15.1 సెంటీ మీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ లో 12.2 సెంటీ మీటర్లు, బంజారాహిల్స్ లో 10.5 సెంటీ మీటర్లు, శ్రీనగర్ కాలనీలో 9.5 సెంటీమీటర్లు, అబిడ్స్ లో 8, సికింద్రాబాద్ లో 8.5, పాటిగడ్డలో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.
జడి వానకు ప్రధాన రహదా రులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తింది. ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. వాహనదారులు, ప్రయాణికులు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని విలవిల్లాడారు. వరద నీటిలో వాహనాలు నిలిచిపోయి నానా అవస్థలు పడ్డారు. తట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు నాలాలు ఉప్పొంగాయి. రోడ్లపై, కాలనీల్లో కాలువలు పారాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు నిలవడంతో..రంగంలోకి దిగిన జీహెచ్ంఎసీ అత్యవసర బృందాలు.. వరదనీటిని తొలగించేందుకు సహాయకచర్యలు చేపట్టాయి. వర్ష బీభత్సానికి పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపడి కొన్నిగంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షానికి హైదరాబాద్ అంబర్ పేట్ లో ఉన్న గోల్నాక డివిజన్ లోని శంకర్ నగర్ లో పురాతన ప్రహరీ గోడ కూలింది. గోడకి ఆనుకుని ఉన్న కూరగాయల వ్యాపారులు గోడ కూలడం చూసి అప్రమత్తమయ్యారు. చూస్తూ ఉండగానే భారీ ప్రహరీ గోడ కూరగాయల తోపుడుబండ్ల మీద పడింది. అయితే ముందే అప్రమత్తం కావడంతో..పెద్ద ప్రమాదం తప్పింది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది.