మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలోనే. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పరాజయం పాలయి చతికిలపడింది. ఈ 5 స్థానాల్లో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి నాలుగింట విజయం సాధించాయి. ఒక నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మహారాష్ట్రలో పట్టభద్రులు, టీచర్లు బీజేపీని తిరస్కరించారనడానికి ఇది నిదర్శనం.

పూణె పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్సీపీ అభ్యర్థులు అరుణ్ లాల్, ఔరంగాబాద్ లో సతీష్ భానుదాస్రావ్ చవాన్, పూణె ఉపాధ్యాయ నియోజవకర్గంలో కాంగ్రెస్ నేత జయంత్ దినకర్ ఆస్గావ్కర్, నాగపూర్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత అభిజిత్ గోవిందరావు వంజారి, అమరావతి డివిజన్ ఉపాధ్యాయ నియోజవర్గంలో స్వతంత్ర అభ్యర్థి కిరణ్ సారానాయక్ గెలుపొందారు. ఈ ఐదు స్థానాల్లో బీజేపీ ఓటమి చవిచూసింది.