మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెరాస సీనియర్ నేత, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిగి ఎమ్మెల్యేగా మూడు సార్లు కమతం విజయం సాధించారు. 1968లో కాంగ్రెస్ పార్టీ చీఫ్‌విప్‌గా పనిచేశారు. 1977లో వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చిన ఆయన టీఆర్ఎస్లో చేరారు. ఈరోజు సాయంత్రం మహబూబ్‌నగర్‌లోని ఆయన స్వగ్రామమైన మహమ్మదాబాద్‌లో అంత్యక్రియలు జరుగనున్నాయి. కమతం అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.