తెలంగాణలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్‌కు అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర హోంశాఖ దేశంలోని 16,671 పోలీస్ స్టేషన్లలో 10 ఉత్తమ పోలీస్ స్టేషషన్ల జాబితాను విడుదల చేసింది. వాటిలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌కు 10వ స్థానం దక్కింది. వివిధ విభాగాల్లో పోలీస్ స్టేషన్ల పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ మేరకు 2015లో గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన డీజీపీల సదస్సులో పోలీసు స్టేషన్ల పనితీరు గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డేటా విశ్లేషణ, నేరుగా పనితీరు పరిశీలన, ప్రజల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కేంద్ర హోం శాఖ పోలీసు స్టేషన్లకు ర్యాంకులు ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో ఉత్తమంగా పనిచేసిన పోలీస్ స్టేషన్ల షార్ట్ లిస్టుతో కేంద్రం ర్యాంకింగ్ ప్రక్రియ చేపట్టింది. ఆస్తులకు సంబంధించిన నేరాలు, మహిళలపై నేరాలు, బలహీనవర్గాలపై నేరాలు, తప్పి పోయిన వ్యక్తులు, గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించిన విషయాల్లో కేసులను ఈ ఏడాది కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. ఒక్కో రాష్ట్రం నుంచి 750కి పైగా పోలీస్ స్టేషన్లను గుర్తించి వాటిలో ఒకటి లేదా రెండు పోలీస్ స్టేషన్లను అధికారులు ఎంపిక చేశారు. వాటిలో.. తెలంగాణ నుంచి.. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ టాప్ టెన్ లో నిలిచి.. సత్తా చాటింది.