24.2 C
Hyderabad
Friday, January 22, 2021

మీసమైనా మొలవక ముందే.. ముష్కరుల తలలు తెగ నరికిన వీరుడు

కుడి చేతిలో పెన్ను, ఎడమచేతిలో గన్ను పట్టుకొని. మీసమైనా మొలవక ముందే ముష్కరుల తలలు తెగ నరికిన వీరుడాయన. తన అక్షరాలతో కోట్ల అణుబాంబుల శక్తిని రగిలించి ప్రజల్లో చైతన్యపు నిప్పు కణికల్ని మండిచిన అక్షర యోధుడాయన. అతను కన్న కల కోసం ఆస్తినీ, జీవితాన్నీ త్యాగం చేసిన ఆ మహాయోధుడు.. తెలంగాణ ముద్దు బిడ్డ.. రావెళ్ల వెంకట రామారావు. ఇయ్యాల ఆయన వర్థంతి సందర్భంగా టీ న్యూస్ డిజిటల్ మీడియా అయనకు అక్షర నివాళులు అర్పిస్తోంది.

ఆయన మాటలే.. తూటాలు

వీరులకు కాణాచిరాతెలంగాణ.. ధీరులకు మొగసాలరా అంటూ పోరుగడ్డ తెలంగాణ పౌరుషాన్ని చాటిన ప్రజాకవి రావెళ్ల. ఆయన నిలువెత్తు రూపం.. ఆరవయేండ్ల తెలంగాణ ఉద్యమానికి సాక్షి. కండ్లద్దాల మాటున వెలుగు చిమ్ముతున్న ఆయన కండ్లల్లో తెలంగాణ చరిత్ర తొణికిసలాడుతుంది. ఆయన ఒంటిని చిధ్రం చేసిన తూటాల గుర్తులు తెలంగాణ గడ్డపై పేలిన అగ్నిపర్వతాల ఆనవాళ్లకు నిదర్శనం. తెలంగాణ యువకిశోరాలకు స్ఫూర్తి నిస్తూ.. తెలంగాణ రాష్ట్రం చూసేవరకు నా దరికి రావద్దని మృత్యువును తరిమికొట్టిన రణ సింహం రావెళ్ల వెంకట రామారావు.

ఆ పాట అడిగి మరీ పాడించుకున్నారు

స్వాతంత్రోద్యమానికి ముందే తెలంగాణ కోసం నినదించిన ధిక్కార స్వరం రావెళ్లది. నూనుగు మీసాల యవ్వనంలోనే నైజాం రాజును ధిక్కరించిన రాటుదేలిన గుండె ఆయనది.  దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాల తరపున ఓ చేత్తో పెన్ను, మరో చేత్తో గన్నపట్టి నినదించిన ఆయన తెలంగాణ ఉద్యమ చరిత్రకు పునాది రాయి. భూమి కోసం భుక్తి కోసం ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రావెళ్ల కలం నుండి జాలువారిన మహాగీతం తెలంగాణ మాతృగీతమయింది. కదనాన శత్రువుల కుత్తుకలనవలీల.. నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి…. వీరులకు కాణాచిరా…తెలంగాణ ధీరులకు మొగసాలరా అంటూ సంకకు తుపాకీ వేసుకొని బహిరంగ సభలల్లో రావెళ్ల పాడుతుంటే.. నెత్తరు సలసలా మరిగేది. ఆ గేయం ఎంత పాపులర్ అయిందంటే కమ్యూనిస్టు అగ్రనేతలు పాడొద్దని ఆదేశించినా… జనం మాత్రం ప్రసంగాలు వద్దు ఆ పాటే కావాలని జిద్దు చేసేటోళ్లు.

తెలంగాణ షేర్

తెలంగాణ ఉద్యమ సాహిత్య బావూటా రావెళ్ల పుట్టి.. పెరిగింది ఉద్యమాల గుమ్మం ఖమ్మం జిల్లా గోకినేపల్లి. ఉన్నత రైతు కుటుంబంలో పుట్టినా..  ప్రతీక్షణం బడుగు,బలహీన వర్గాల గురించే ఆలోచించేటోడు. నాటి రైతాంగాన్ని నైజాం పాలకులు నిలువు దోపిడి చేస్తుంటే రావెళ్ల చలించిన్రు. పద్నాలుగేళ్ల వయసులోనే పోరాట బాట పట్టిన్రు. ఆంధ్రమహాసభలో చేరి నిజాంకు  వ్యతిరేకంగా పోరాడిన్రు. గోకినేపల్లి చుట్టుపక్కల 80 ఊర్లల్ల దళాన్ని  ఏర్పాటుచేసి నైజాం రాజుకు సింహస్వప్నమయిన్రు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను సర్కార్ దోచుకుంటుంటే …ఆ సొత్తును రజాకార్ల  నుంచి వసూలు చేసిన ధీరుడు రావెళ్ల. రైతాంగపోరాటంలో అగ్రభాగాన ఉండి పోరాడినందుకు సుదీర్ఘ కాలం జైలు జీవితం అనుభవించిండు. జైల్లో ఉన్నప్పుడు ప్రముఖుల పరిచయాలు రావెళ్లలో  ఉద్యమ స్ఫూర్తిని రగిలించినయ్. సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషల మీద పట్టు సాధించిడానికి ఆయనకు జైలు జీవితం ఎంతో ఉపయోగపడింది. చెరసాలలో ఉండి కూడా తన సాహిత్యంతో ఎంతో మంది ఉద్యమకారులను తయారుచేసిన్రు. సుప్రీం కోర్టు జడ్జీలు కూడా  ఏ తెలంగాణ షేర్ హై అని రావెళ్ల ఖలేజాను మెచ్చుకున్నోళ్లే.

ఆయన కలానికి దాసోహమైన అవార్డులు

ప్రతి అక్షరంలో తెలంగాణ ఆరాటాన్ని పోరాటాన్ని నింపిన మేథోమూర్తి రావెళ్ల. కత్తిని, కలాన్ని ఒకే ఒరలో ఇమిడ్చి మేధావులకే స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాత. కలం పట్టినా, కత్తి దూసినా అన్యాయమైపోతున్న తెలంగాణ గడ్డ గురించే ఆయన తపనంతా. తెలంగాణ గుండెచప్పుడు వినిపిస్తూ ఆయన చేసిన అక్షరయాగం తెలంగాణ బిడ్డల గుండెల్లో మారుమోగుతుంది. ఆయన సాహిత్య సమరంపై దేశవ్యాప్తంగా అవార్డుల వెల్లువ కురిసింది. ఏడు దశాబ్దాల ఆయన ప్రజాజీవితంలో వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు లెక్కలేనన్ని.  రాగజ్యోతులు, జీవనరాగం, అనలతల్పం, చైతన్య స్రవంతి, పల్లెభారతి, తాండవహేళ కవితా సంకలనాలు రావెళ్ల కలం నుండి జాలువారినయే. ఇవే కాక ఎన్నో రేడియో ప్రసంగాలు, వ్యాసభారతి, కథాభారతి, ఇంకా ఎన్నో గేయాలు ఆయన సాహితీ జైత్రయాత్రలో మచ్చుతునకలు.  1989లో రాష్ట్ర  అధికార  భాషా సంఘంలో సభ్యుడైన రావెళ్ల రాష్ట్ర గంథ్రాలయ  సంస్థ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ, సంస్కృత భాషా ప్రచార సమితిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన్రు.  సహజకవి పోతన, కర్షక కవి వంటి బిరుదులు రావెళ్ల పేరు ముందు చేరి మురిసిపోయినయ్. రావెళ్ల అంటే నాటి కవులకు ఎంతో గౌరవం. కాళోజి, వానమామలై వరదాచార్యులు, వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథిలతో రావెళ్లకు ఎనలేని సాహిత్యానుబంధం ఉండేది.

గాయాలతో సహజీవనం

తెలంగాణ ప్రజల ధీరత్వాన్ని, శూరత్వాన్ని చాటి చెప్పి, ప్రజల్లో ఆవేశాన్ని రగిల్చిన పోరాట దిక్సూచి  రావెళ్ల. స్వరాష్ట్ర స్వప్నం సాకరమయ్యే రోజు కోసం ఒళ్లంతా కండ్లు చేసుకుని ఎదురుచూశిండు. మనిషి జీవించడానికి సంపదే కాదు ఆలోచించే హృదయం కూడా అవసరమని చెప్పే రావెళ్ల తన చివరి రోజుల్లో పాత పెంకుటిల్లు, రెండెకరాల చెలకతో కాలం వెళ్లదీశిర్రు. పోరాట సమయంలో శత్రువుల తుపాకీ తూటాలు చేసిన గాయాల జ్ఞాపకాలతో సహజీవనం చేశిర్రు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలంటే చులకన భావం ఉన్న ఆంధ్రోళ్ల కు చురక పెట్టాలనే తెలంగాణ మాతృగీతాన్ని రాశిర్రు. తెలంగాణ ప్రజల జీవితం ఇక్కడి సంస్కృతితో ముడిపడి ఉందని, ఇక్కడోళ్లు కులమతాల కన్నా గుణగణాలకే ఎక్కువ విలువనిస్తరని చెప్పేవారు.

స్వరాష్ట్రం చూడాలన్న కోరిక తీరకుండానే..

వయసు ఉడిగి పోయినా రావెళ్ల రక్తంలో అదే వేడి వాడి. తెగించి కొట్లాడిన యువ తెలంగాణ బిడ్డలపై ఆయనకు అపార నమ్మకం ఉండేది. ఒక్కటై పొటెత్తుతున్న తెలంగాణ శక్తిపై ఆయన అంతులేని విశ్వాసాన్ని నిర్మించుకున్నడు. అందుకే  ఇదే ఆఖరి మోఖా అంటూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో యువతను ఉత్సాహపరిచిండ్రు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసే ప్రాణాలు వదులుతా అని నిత్యం తన దగ్గరివారితో చెప్పేవారు. పోరాటంలో ధీరత్వాన్ని, పాటలో తెలంగాణ శూరత్వాన్ని చూపించిన తెలంగాణ సాహిత్య శిఖరం రావెళ్ల. 87 వయస్సులో కూడా తన కవితా కుటీరంలో పుస్తకాలతో సహవాసం చేశారు. తన చివరిశ్వాస తెలంగాణ రాష్ట్రంలోనే పోవాలని కోరుకున్నరు. కానీ.. తన చివరి కోరిక తీరకుండానే 2013 డిసెంబర్ 10న అంటే.. సరిగ్గా ఇదే రోజున బతుకు యుద్ధరంగం నుంచి నిష్క్రమించిండ్రు. ఇయ్యాల ఆయన వర్ధంతి సందర్భంగా టీ న్యూస్ డిజిటల్ మీడియా అక్షర నీరాజనం.

- Advertisement -

Latest news

Related news

కరోనాను కంట్రోల్ చేయలేక ప్రధాని రిజైన్.. ఎక్కడంటే..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ఎంత గజగజలాడించినా అన్ని దేశాలు ఎంతోకొంత ప్రయత్నం చేస్తూ.. కొంతవరకైనా కట్టడి చేస్తున్నాయి. అయితే ఒక దేశంలో మాత్రం కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రే...

ప్రభాస్ పెళ్లిపై రెబల్ స్టార్ కామెంట్

ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ప్రభాస్ ఒకరు. పాన్‌ ఇండియా స్టార్‌గా అదరగొడుతున్న ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ టాపిక్ వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. బాహుబలి...

మహేశ్ కొత్త ఫొటోలు చూశారా?

మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం జిమ్ముల్లో కసరత్తులు...

స్ట్రీట్‌కు సుశాంత్ పేరు.. ఎక్కడంటే..

దివంగత బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓ అరుదైన గౌరవం లభించింది. సుశాంత్ పేరుని ఢిల్లీ ప్రజలు మర్చిపోకుండా ఢిల్లీ మున్సిపల్ అధికారులు ఓ నిర్ణయం తీసుకున్నారు.