సీఎం కేసీఆర్ ఈరోజు సిద్దిపేటలో పర్యటిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్దిపేటలో సీఎం పర్యటన ఉంటుంది. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నర్సాపూర్ రోడ్ లో 45 ఎకరాల్లో నిర్మించిన 2460 డబుల్ బెడ్రమ్ ఇండ్ల సముదాయాన్ని సీఎం ప్రారంభించి.. 144 మంది లబ్దిదారులతో సీఎం గృహ ప్రవేశాలు చేయిస్తారు. ఈ కాలనీకి కేసిఆర్ నగర్ గా నామకరణం చేసినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులోని టిఆర్ఎస్ భవన్ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ఉదయం 11 గంటలకు దుద్దెడలో 3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఐటి టవర్ కు శంకుస్థాపన చేస్తారు. 2000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం రూ.45 కోట్లు వెచ్చించి ఈ ఐటీ టవర్ నిర్మిస్తున్నారు. అనంతరం మూడు కంపెనీలతో MOU కుదుర్చుకోనున్నారు. ఆ తర్వాత మిట్టపల్లిలోని రైతు వేదిక ను ప్రారంభిస్తారు.
అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించి, వెయ్యి పడకల ఆస్పత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ. 278 కోట్లతో 328 కి.మీ పైప్ లైన్ తో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రీట్ మెంట్ ప్లాంటును ప్రారంభించి ఆ తర్వాత రంగనాయక సాగర్ మధ్యలో నిర్మించిన అతిథి గృహాన్ని సీఎం ప్రారంభిస్తారు. సిద్దిపేటకు రూ.168 కోట్ల నిధులతో మంజూరు చేసిన రింగ్ రోడ్డును ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. ఈ రింగ్ రోడ్డుకు కేసీఆర్ మార్గ్ అని నామకరణం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.