కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల.. రైతులు సొంత భూముల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో ఆయన భారత్ బంద్ లో పాల్గొన్నారు. 53 ఏళ్ల క్రితమే రైతులకు మద్దతు ధర వచ్చిందని.. మోదీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర లేకుండా చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

రైతుల పంటలు ఎక్కడైనా అమ్ముకోవడం.. ఆచరణలో అమలు అయ్యే పరిస్థితి ఉండదని తెలిపారు. కొత్త చట్టం అమలులోకి వస్తే వ్యవసాయం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తుందని.. సమిష్టిగా పోరాడి రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్పొరేట్ చట్టంతో సొంత భూముల్లోనే రైతులు కూలీ చేసుకొనే పరిస్థితి వస్తుందన్నారు. రైతులకు నష్టం చేసే చట్టాలను వెంటనే ఉపసంహరణ చేసుకోవాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.