నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడి
హఫీజ్‌పేట భూ వివాదం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి జరిగిన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను అరెస్ట్ చేశామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
మనోవికాస్ నగర్‌లోని కృష్ణా రెసిడెన్సీలో ఉంటున్న ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావు సోదరులను 10 మందితో కూడిన బృందం కిడ్నాప్ చేసిందన్నారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చ్ వారెంట్ చూపించి ఇంట్లోకి వెళ్లిన నిందితులు కిడ్నాప్ చేశారన్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టాయన్నారు. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, ఇతర జిల్లాలతో పాటు ఏపీ పోలీసులకూ సమాచారం ఇచ్చామన్నారు.
తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో నార్సింగి- కోకాపేట ప్రాంతంలో ముగ్గురు సోదరులను నిందితులు విడిచిపెట్టారని సీపీ చెప్పారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2 భూమా అఖిలప్రియ, ఏ3 భార్గవ్‌రామ్‌ను చేర్చామన్నారు. మిగతా నిందితులు శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుంటూరు శ్రీను, సాయి, చంటి, ప్రకాశ్‌గా గుర్తించామని చెప్పారు. వాళ్లంతా పరారీలో ఉన్నారని.. త్వరలోనే పట్టుకుంటామన్నారు.