రాష్ట్రంలో నిన్న జరిగిన వ్యాక్సినేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయింది.. శనివారం ఉదయం 10.30కు ప్రధాని ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో మొదటి వ్యాక్సిన్‌ను గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కిష్టమ్మకు వేశారు. గాంధీ ఆస్పత్రిలో ఆమె 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. కోవిడ్ ఎక్కువగా ఉన్న టైంలో కూడా ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ.. కొవిడ్ వార్డుల్లో సేవలందించారు.
కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌కు జనం రాకపోవడంతో.. 94శాతం మందికే టీకాలు ఇచ్చారు. తొలుత ప్రతి కేంద్రానికి 30 మంది చొప్పున మొత్తం 4,200 మందికి టీకాలు ఇవ్వాలని ప్రణాళిక వేశారు. కానీ కొన్ని కారణాల వల్ల 232 మంది వ్యాక్సినేషన్‌కు రాకపోవడంతో 3,962 మందికి టీకాలు ఇచ్చారు. కొంతమంది భయంతో టీకా వేయించుకునేందుకు రాలేదని తెలుస్తోంది. వారి స్థానంలో.. రెండో జాబితాలో ఉన్న లబ్ధిదారులకు టీకాలు పంపిణీ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న వారి బొటనవేలిపై సిరా చుక్కతో గుర్తుపెట్టారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారిని అరగంట పాటు అబ్జర్వేషన్ రూంలో ఉంచారు. అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తర్వాత మరో గంట పాటు వెయింట్ హాల్లో కూర్చోబెట్టారు. అన్ని చోట్లా కొవీషీల్డ్ వ్యాక్సిన్నే ఇచ్చారు. టీకాలు తీసుకున్న వారిలో 11 మందిలో చిన్నచిన్న సైడ్ఎఫెక్ట్స్ కనిపించినట్లు అధికారులు చెప్పారు. వైద్య శాఖ హెచ్వోడీలందరికీ తొలిరోజే టీకా ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 34 కేంద్రాల్లో 949 మందికి టీకాలు వేశారు. వీరిలో పారిశుధ్య కార్మికులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత వైద్యులు, నర్సులు, ఆశావర్కర్లకు ప్రాధాన్యమిచ్చారు.