ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ మొదలుకానుంది. అయితే వ్యాక్సిన్‌కు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్.. ఈరెండు టీకాలకూ సంబంధించి.. వాటిని ఎలా తయారు చేశారు ఏ రకం టీకా, ఎంత డోసు ఇవ్వాలి, ఎవరికి టీకా ఇవ్వకూడదు?, టీకాలను ఎలా నిల్వ చేయాలి, టీకా తీసుకున్నాక ఎలాంటి ఎఫెక్ట్స్ కనిపిస్తాయి? అప్పుడు ఏం చేయాలి? లాంటి వివరాలన్నీ ఫ్యాక్ట్‌షీట్ రూపంలో పంపారు. ఇంతకీ టీకాకు సంబంధించన వివరాలేంటంటే..
ఇవి మస్ట్..
టీకాను 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఇవ్వాలి. ఒక టీకా తీసుకున్న తర్వాత ఇతర టీకాలు తీసుకోవడానికి కనీసం 14 రోజుల గ్యాప్ ఉండాలి. మొదటి డోసుగా ఏ టీకా తీసుకుంటే రెండో డోసు కూడా అదే టీకా ఇవ్వాలి.
వీరికి వద్దు..
గతంలో ట్రయల్స్‌లో భాగంగా టీకా డోసు తీసుకుని అలర్జీ వచ్చినవారికి టీకా వేయకూడదు. ఫుడ్ అలర్జీ, మెడిసినల్ అలర్జీలు ఉన్నవారికి టీకా వేయకూడదు. గర్భిణులు, పాలిచ్చే తల్లులపై కొవిడ్-19 వ్యాక్సిన్ ట్రయల్స్ జరగలేదు కాబట్టి వారికి వ్యాక్సిన్ వేయకూడదు.
వీరికి జాగ్రత్తగా..
బ్లీడింగ్ డిజార్డర్స్, ప్లేట్ లెట్ డిజార్డర్స్ ఉన్నవారికి వ్యాక్సిన్ వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి, కరోనా వచ్చి యాంటీబాడీస్ లేదా ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి, హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నవారికి.. కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాత మాత్రమే టీకా ఇవ్వాలి.
వీరికి ఇవ్వొచ్చు..
ఇమ్యూనిటీ తక్కువ ఉండేవారికి, గతంలో కొవిడ్ వచ్చి తగ్గినవారికి, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి టీకా ఇవ్వొచ్చు. ఇవ్వొచ్చు.

ఇలా జరుగుతుంది
కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్.. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వస్తేనే వ్యాక్సిన్ పనిచేస్తున్నట్టుగా భావించాలి. ఎవరికైనా సమస్య తీవ్రమైతే చికిత్స చేసేందుకు టీం రెడీగా ఉంటుంది.
లక్షణాలు ఇవీ..
కొవిషీల్డ్ : టీకా వేసిన ప్లేస్ నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జ్వరం, చలి, అలసట, కండరాల నొప్పులు, కడుపులో వికారం.
కొవాగ్జిన్ : టీకా వేసిన ప్లేస్ లో నొప్పి, చర్మం సున్నితంగా మారటం, తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం, కడుపులో వికారం. వాంతులు, చమట పట్టడం, జలుబు, దగ్గు, వణుకు.
టీకా తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కంగారు పడాల్సిన పని లేదు. ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకొంటే సరిపోతుందని డాక్టర్లు సూచిస్తున్నారు.