దేశానికి అన్నంపెట్టే రైతన్నపై జలఫిరంగులు ఎగసిపడ్డాయి. ఊపిరి సలుపనివ్వకుండా బాష్ప వాయు గోళాలు విరుచుకుపడ్డాయి. అయినా అన్నదాతలు వెన్ను చూపలేదు. రైతుల ఉసురు తీసి, కార్పొరేట్ సంస్థలకు లాభంచేకూర్చేలా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్నదాతలు కదంతొక్కారు. కేంద్రప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఢిల్లీ వైపు వెళ్తున్న పంజాబ్ రైతులను బీజేపీ పాలనలో ఉన్న హర్యానా పోలీసులు గురువారం సరిహద్దు ప్రాంతం షంభూ దగ్గర బారికేడ్లతో అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని లౌడ్ స్పీకర్లలో హెచ్చరించారు. అయినా రైతులు ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదు.
బారికేడ్లను తోసుకుంటూ కదం తొక్కారు. పోలీసుల తీరును నిరసిస్తూ కొందరు బారికేడ్లను ఘగ్గర్ నదిలో విసిరేశారు. దూసుకువస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. దీంతో రైతులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రైతులు, సాధారణ ప్రజలు నల్లరంగు జెండాలను ప్రదర్శిస్తూ, పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ట్రాక్టర్లు, లారీలలో వచ్చిన వేలాది మంది రైతులు ర్యాలీలో పాల్గొని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘శాంతియుతంగా తెలుపుతున్న తమ నిరసనలను హర్యానా పోలీసులు అణిచివేయడాన్ని ఖండిస్తున్నాం. నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును వాళ్లు కాలరాశారు’ అని ఓ పంజాబ్ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.