‘చలో ఢిల్లీ’ని అడ్డుకున్న హర్యానా పోలీసులపై పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మండిపడ్డారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని, రాజ్యంగ విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హర్యానా ప్రభుత్వం చేపట్టిన చర్యలను.. ‘పంజాబ్ 26/11’ దాడులుగా శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ పోల్చారు. నవంబర్ 26, 2008లో ముంబైపై ఉగ్రవాదులు చేపట్టిన దాడులను పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను దేశానికి శత్రువులుగా భావిస్తున్నదని మరో ఎస్ఏడీ నేత హర్సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. శాంతియుతంగా ఉద్యమిస్తున్న రైతులను అడ్డుకోవడం తప్పుడు చర్య అని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

మోదీ సర్కార్ క్రూరమైన విధానాలను వ్యతిరేకిస్తూ రైతులు దృఢంగా నిలబడ్డారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనల రూపంలో రైతులు చూపెడుతున్న తెగువను ఆయన కొనియాడారు. గడ్డకట్టే చలిలో నిరసనలు తెలుపుతున్న రైతులపై నీటి ఫిరంగులను ప్రయోగించడాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. రైతులపై పోలీసుల దాడులు తనను కలిచివేశాయని మాజీ ప్రధాని, జేడీయూ అధినేత హెచ్ డీ దేవెగౌడ పేర్కొన్నారు. రైతులను గౌరవించాలన్న స్పృహ కేంద్ర ప్రభుత్వానికి లేదా అంటూ మండిపడ్డారు.