కేంద్ర ప్రభుత్వంపై.. రైతులు నాగలెత్తి తిరుగుబాటు చేస్తున్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో వ్యవసాయ రంగం మరింత కుదేలవుతుందని.. ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని దేశ రాజధానిలో.. దిక్కులు పెక్కటిల్లేలా నినదిస్తున్నారు.

రైతులు ఢిల్లీలో ప్రవేశించకుండా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ ఆందోళనకు తరలి వస్తున్నరైతులను ఎక్కడికక్కడ ఆపేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నది. ఢిల్లీ వదిలి వెళ్లాలని హుకూం జారీ చేసింది. ప్రభుత్వ బెదిరింపులకు ఏమాత్రం బెదరని రైతులు.. ఢిల్లీ దిగ్భంధిస్తామని పిలుపునిచ్చారు. డిసెంబర్ 3న చర్చలకు పిలుస్తామని.. అప్పటి వరకు ఢిల్లీలోని బురాడిలోని నిరంకారీ మైదానంలో ఆందోళన కొనసాగించమని కేంద్రం సూచించగా.. రైతులు రామ్ లీలా మైదానంలో ఆందోళన కొనసాగించడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా రైతులు ఆందోళన కొనసాగిస్తూనే.. రోడ్డుపై ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని ప్రసాదంగా అందరూ పంచుకున్నారు.