వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గురు, శుక్రవారాల్లో ‘చలో ఢిల్లీ’ ఆందోళనలకు రైతు సంఘాలు పిలుపునివ్వడంతో బీజేపీ అధికారంలో ఉన్న హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. ర్యాలీగా వచ్చే పంజాబ్ రైతులను అడ్డుకోవడానికి రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. కీలక ప్రాంతాల్లో పలు అంచెల్లో బారికేడ్లను ఏర్పాటు చేసింది. మరోవైపు, ‘చలో ఢిల్లీ’ నిరసనలకు అనుమతిని నిరాకరిస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో గురువారం రాజధాని ఢిల్లీ సరిహద్దులను మూసివేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. డ్రోన్లతో భద్రతను పర్యవేక్షించారు.