’సెంట్రల్ విస్టా‘కు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్

కొత్త పార్లమెంట్ భవనం ‘సెంట్రల్ విస్టా’ నిర్మాణానికి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, దినేశ్ మహేశ్వరి, సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ 2:1 మెజార్టిలో తీర్పును వెలువరించింది. సెంట్రల్ విస్టాకు పర్యావరణ అనుమతులు, డిజైన్, స్థలం కేటాయింపు తదితర అంశాలపై సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. పార్లమెంట్ భవన నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పర్యావరణ శాఖ అనుమతులు, డిజైన్ తదితర అంశాలపై కేంద్రంతో ఏకీభవించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు సెంట్రల్ విస్టాలో అధిక సంఖ్యలో చిమ్మీలను  ఏర్పాటు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది.

1927లో నిర్మితమైన ప్రస్తుత పార్లమెంట్ భవనం స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో పాటు భవిష్యత్ అవసరాలకు సరిపోయేలా నూతన పార్లమెంట్ భవనం ‘సెంట్రల్ విస్టా’ నిర్మించనున్నారు. రూ.20 వేల కోట్లతో నిర్మించే ఈ భవనం భారతీయ సంప్రదాయాలకు ప్రతీకగా నిలవనుంది. డిసెంబర్ 10న సెంట్రల్ విస్టాకు ప్రధాని నరేంద్రమోడీ శంకస్థాపన చేసిన విషయం తెలిసిందే.