హనుమాన్ ఆలయ నిర్మాణానికి తన స్వంత భూమిని విరాళంగా ఇచ్చి.. ముస్లిం మత సామరస్యాన్ని చాటాడు. హెచ్ఎంజీ బాషా బెంగళూరు సమీపంలోని కడుగోడి గ్రామస్థుడు. కడుగోడి పొరుగు గ్రామమైన మైలపురలో ఆంజనేయ స్వామి ఆలయనిర్మాణం కోసం రూ.80లక్షల విలువ చేసే భూమిని విరాళంగా ఇచ్చి మత సామరస్యాన్ని చాటాడు.
కడుగోడిలో నివాసముంటున్న హెచ్ఎంజీ బాషాకు హైవే సమీపంలోని మైలపురలో మూడెకరాల భూమి ఉంది. హనుమాన్ ఆలయాన్ని విస్తరించడానికి ఆరు నెలల క్రితం దేవాలయ కమిటీ సభ్యులు బాషాను స్థలం కోరారు. ఆలయ నిర్మాణం కోసం తన భూమిని ఉచితంగా ఇచ్చేస్తానని బాషా తెలిపారు. అయితే ఆలయ కమిటీ సభ్యులు 1.5 సెంట్లు భూమి మాత్రమే కోరగా.. బాషా ఏకంగా ఒకటిన్నర గుంటల భూమి విరాళమిచ్చి గొప్ప మనస్సును చాటుకున్నారు.
‘ప్రస్తుతం ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం ఇరుకుగా ఉంది. పూజలు, ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గుడి ఆవరణ పెంచి భక్తుల ఇబ్బందులు తీర్చాలని నిర్ణయించుకున్నాను. అందుకే.. నా స్వంత భూమిని గుడికి విరాళంగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నా’ అని బాషా తెలిపారు. ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి తన భూమిని విరాళంగా ఇవ్వడానికి బాషా స్వచ్చంధంగా ముందుకు వచ్చారని.. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని.. ఆయల ధర్మకర్త బైరిగౌడ తెలిపారు. ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హనుమాన్ ఆలయ నిర్మాణానికి భూమి విరాళంగా ఇవ్వడం గొప్ప విషయమని బైరిగౌడ అన్నారు. బాషా గొప్ప మనసు గురించి పలువురికి తెలిసేలా నిర్మాణంలో ఉన్న ఆలయం ముందు పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజనులు బాషాను అభినందిస్తున్నారు.