19.4 C
Hyderabad
Monday, November 30, 2020

హైద‌రాబాద్ వరద బాధితులకు భారీ విరాళాలు

అసాధారణ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్నాయి. హైద‌రాబాద్ న‌గరంలో కురిసిన కుండపోతకు కాల‌నీలు, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులకు గండ్లు పడగా.. కాలువలు, నాళాలు ఉప్పొంగాయి. జల దిగ్బంధంలో చిక్కుకుని నగర ప్రజ‌లు దిక్కుతోచక అల్లాడుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు రాష్ట్ర ఆదాయం పడిపోగా.. ప్రస్తుతం కురుస్తున్న కుండపోత వర్షాలు, భారీ వరదలకు వేల కోట్ల మేర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని… సీఎంఆర్‌ఎఫ్‌కు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు.. పలు రాష్ట్రాల సీఎంలు, ఎమ్మెల్యేలు, వివిధ సంస్థలు, వ్యాపారవేత్తలు తమ ఉదారతను చాటుకుంటున్నారు. తమకు తోచిన రీతిలో రాష్ట్ర ప్రజలకు ఆపన్న హస్తం అందిస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణకు తక్షణం 10 కోట్లు వరద సాయంగా అందిస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అటు తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. పలనిస్వామికి ఫోన్ చేసిన సీఎం.. రాష్ట్రంలో పరిస్థితిని వివరించారు. ఎంతో ఉదారతను చాటుకున్నారని అభినందించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రంలో సహాయ పునారావాస కార్యక్రమాల కోసం.. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తమ రాష్ట్రం తరుఫున 15 కోట్ల సాయాన్ని ప్రకటించారు. అటు ఢిల్లీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరుఫున సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కేజ్రీవాల్ ఎంతో ఉదారత చాటుకుని అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణలో వరద బాధితులకు పశ్చిమబెంగాల్‌ ఆర్థికసాయం ప్రకటించింది. సీఎం సహాయ నిధికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ రాశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. బెంగాల్‌లో బీభత్సం సృష్టించిన ఆంఫన్‌ తుఫాన్‌ను లేఖలో గుర్తు చేసిన మమతా.. ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో తమకు తెలుసన్నారు. ఈ కష్టకాలంలో తెలంగాణ ప్రజలకు తాము అండగా ఉంటామని దీదీ చెప్పారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్‌.. ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిహెచ్ఎంసి పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు విరాళాలు ప్రకటించారు. రెండు నెలల వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. హైద‌రాబాద్ ప్రజలకు  అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని  భరోసా ఇచ్చారు. అటు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ ఫ్రా సంస్థ.. 10 కోట్ల విరాళం, అపర్ణ కన్ స్ట్రక్షన్స్ 6 కోట్ల రూపాయలు,  మైహోమ్ గ్రూప్ 5 కోట్ల విరాళం ప్రకటించాయి. ఈ విపత్తు నుంచి హైదరాబాద్ త్వరగా కోలుకోవాలని మైహోమ్ సంస్థ ఛైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు ఆకాంక్షించారు. వరద బాధితులకు కొంతైనా సాయం చేయడం హైదరాబాద్ పౌరుడిగా తన బాధ్యత అని చెప్పారు.  అలాగే సీఎంఆర్‌ఎఫ్‌కు రూ. 2 కోట్లు విరాళం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

భారీ వర్షాలు, వరదలతో సతమతం అవుతున్న హైదరాబాద్ ప్రజలకు టాలీవుడ్‌ అండగా నిలుస్తోంది. సీఎం కేసీఆర్ పిలుపునందుకుని సినీ హీరోలు ఒక్కరొక్కరుగా విరాళాలు ప్రకటిస్తున్నారు. హీరో ప్రభాస్‌.. సీఎంఆర్‌ఎఫ్‌కు కోటీ 50 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. చిరంజీవి, మహేష్ బాబు, పవన్‌ కల్యాన్‌.. తలా కోటి రూపాయలు.. అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్‌టీఆర్‌ చెరో 50 లక్షలు, రామ్‌ 25 లక్షలు, విజయ్‌ దేవరకొండ 10 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. వర్షాలు, వరదలతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు అండగా తాము సైతం అంటూ మనోధైర్యాన్ని ఇస్తున్నారు.

హైదరాబాద్ ప్రజలకు టాలీవుడ్ దర్శకులు, సినీ నిర్మాణ సంస్థ అండగా నిలిచారు. సినీ నిర్మాణ సంస్థ హారిక-హాసిని క్రియేషన్స్, దర్శకుడు త్రివిక్రమ్ కలిసి ముఖ్యమంత్రి సహాయనిధికి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. అటు హీరో రవితేజ 10 లక్షల విరాళం ప్రకటించారు. అలాగే దర్శకులు అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్‌ తలా 5 లక్షల రూపాయలు సాయం అందించారు. సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.