కొత్త సాగు చట్టాలపై కేంద్రం వైఖరికి నిరసనగా 16 ప్రతిపక్ష పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో నిరసన తెలపాలని డిసైడ్ అయ్యాయి. కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు గురువారం కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, శివసేన, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలతో సహా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఒక సంయుక్త ప్రకనటన రిలీజ్ చేశాయి.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలతో ఆహర భద్రతకు విఘాతం కలుగుతుందని, ఇది ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆ ప్రకటనలో ప్రస్తావించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 64 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. ఈ ఆందోళనల్లో దాదాపు 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయిన కేంద్రంలో ఏమాత్రం చలనం లేదని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను ఖండించిన ప్రతిపక్ష పార్టీలు.. వీటి వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చేందుకు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.