2021 బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసింది. కరోనా వల్ల ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని కేంద్రం గుర్తించింది. ఈ కోణంలో ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు చేసింది. ఆత్మనిర్భర్ ఆరోగ్య పథకానికి రూ.2,23,846 కోట్లు కేటాయించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య విధానంలో భాగంగా ఈ పథకం రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ బడ్జెట్ లో 9 బీఎస్ఎల్-3 స్థాయి ల్యాబులు, 15 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థారణ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. దేశంలో కొత్తగా నాలుగు ప్రాంతీయ వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి కోసం ప్రధాని జల్‌జీవన్ మిషన్ అర్బన్ ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రూ.87వేల కోట్లతో 500 నగరాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు, స్వచ్ఛభారత్ మిషన్‌కు రూ.లక్షా 41వేల 678 కోట్లు కేటాయించారు.
