ఏలూరు గుట్టు వీడింది.. పరిశోధన కొనసాగుతోంది
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ స్థాయి పరిశోధన సంస్థలు పరిశోధన జరుపుతున్నాయి. ఈ పరిశోధనల్లో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. ఏలూరు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎస్) శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతో పాటు పలు వస్తువుల శాంపిల్స్ తీసుకున్నారు.
సేకరించిన శాంపిల్స్ ను విజయవాడలోని పరీక్షా కేంద్రంలో పరిశీలించగా దిమ్మతిరిగే ఫలితాలు వెల్లడయ్యాయి. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిలో హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి నమూనాల్లో హానికారక క్రిమి సంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేల్చారు. కృష్ణా కాలువ నుంచి సేకరించిన లీటర్ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్ ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. మామూలుగా అయితే.. ఈ రసాయనం 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లోని నీటి వనరుల్లో ఈ రసాయనం 17,640 రెట్లు అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ రసాయనం ప్రజల శరీరంలోకి వెళితే దీర్ఘకాలంలో క్యాన్సర్ వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.
హానికారక రసాయనాలు కలిసిన ఆహారం, నీరు వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ పరిశోధకులు జేజే బాబు తెలిపారు. బాధితుల నుంచి రక్త, మూత్ర తదితర నమూనాలు, చుట్టు పక్కల ప్రాంతాల్లోని నీరు, కూరగాయలు, ఆహార పదార్థలను పరీక్షలకు పంపినట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం నాటికి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ఇప్పటి వరకు 583 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. వీళ్లలో 470 మంది డిశ్చార్జి కాగా.. మెరుగైన చికిత్స కోసం 20 మంది రోగులను విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు.