ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అత్యంత అరుదైన ఘనత సాధించారు. ఏకదాటిగా 16,000 కి.మీ దూరం ప్రయాణించి మహిళల సత్తాను మరోసారి ప్రపంచానికి చాటారు. మహిళా పైలట్లు సాధించిన ఈ ఘనత పట్ల కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరీ సైతం హర్షం వ్యక్తం చేశారు. ఎయిరిండియాకు చెందిన మహిళల సత్తా ప్రపంచం నలుమూలలా చేరిందని వ్యాఖ్యానించారు.
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి 17 గంటల్లో చేరుకున్నారు. తక్కువ టైంలో చేరుకునేందుకు వారు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించారు. దాంతో వారు దాదాపు 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. ఈ సందర్భంగా నలుగురు పైలట్లలో ఒకరైన కెప్టెన్ జోయా అగర్వాల్ మాట్లాడుతూ.. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించడమే కాకుండా.. అంతా మహిళా పైలట్లే ఈ సాహసాన్ని పూర్తి చేయడం విశేషమని, ప్రపంచ రికార్డు సాధించడం పట్ల చాలా ఆనందంగా ఉందన్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలో (స్థానిక కాలమానం ప్రకారం) శనివారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి.. సోమవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. తమ ప్రయాణంలో ఎక్కడా ఆగకుండా వారు విమానాన్ని నడపడం విశేషం.
ఉత్తరధ్రువం మీదుగా ప్రయాణించడం వల్ల సమయం, ఇధనం ఆదా చేయడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడానికి ఇలాంటి ప్రయాణాలు సహకరిస్తుంటాయి. ఘనత సాధించిన టీంలో తెలుగమ్మాయి పాపగారి తన్మయి కూడా ఉండడం విశేషం. వీరే కాకుండా కెప్టెన్ ఆకాంక్ష సోనావరె, కెప్టెన్ శివానీ మన్హాస్ ఉన్నారు.