ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట ఎమ్మెల్యే రోజా బోరున ఏడ్చారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంతమందికి చెప్పుకున్నా.. ప్రోటోకాల్ పాటించడం లేదని.. ఎమ్మెల్యే అయిన తనను పట్టించుకోవడం లేదని వాపోయారు.
గ్రూపు రాజకీయాలే ఆమె ఆవేదనకు కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు ఆమెను పిలవకపోవడం వల్లనే ఆమె ప్రివిలైజ్ కమిటీ ముందుకు వెళ్లినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా… తనకు సమాచారం అందించలేదని వాపోయారు. ప్రివిలైజ్ కమిటీకి చేసిన ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఆమె ఈరోజు విచారణకు హాజరయ్యారు. సొంత పార్టీ అధికారంలో ఉండగా… తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. శాసనసభ సభ్యురాలిగా ప్రొటోకాల్ ప్రకారం అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు.