పొట్టొస్తుందని బాధపడేవాళ్లందిరికీ నిజంగా పెరిగేది పొట్ట కాదు, బెల్లీ ఫ్యాట్. పొట్టకింది భాగంలో పేరుకున్న కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. దీన్ని తగ్గించుకోవడానికి లేదా కవర్ చేయడానికి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే దీన్ని తగ్గించుకోవడానికి ఒక బెస్ట్ ఎక్సర్ సైజ్ ఉంది. అదేంటంటే..
శరీరంలో అదనంగా తీసుకున్న క్యాలరీలన్నీ ముందుగా బెల్లీ దగ్గరకే వెళ్లి కొవ్వులా పేరుకుపోతాయి. దీన్ని తగ్గించాలంటే పెద్దగా వ్యాయామాలు కూడా అవసరం లేదు. ఒకే ఒక్క ఆసనంతో బెల్లీ ఫ్యాట్ పని పట్టొచ్చు. దాని పేరే పవన ముక్తాసనం. పవనం అంటే గాలి, ముక్త అంటే తొలగించడం. పేగుల్లో పేరుకుపోయిన అపాన వాయువును తొలగిస్తుంది. కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. ఇంగ్లిష్ లో విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు. దీన్నెలా చేయాలంటే..
ఇలా చేయాలి
ఈ వ్యాయామం కోసం ముందుగా నేలపై వెల్లకిలా పడుకుని నెమ్మదిగా శ్వాస పీల్చుకోవాలి. తర్వాత మోకాళ్లను రెండు చేతులతో పట్టుకుని చాతీ వరకు తీసుకురావాలి. పొట్టను లోపలికి అదుముతూ శ్వాసను వదులుతూ మోకాళ్లను నుదుటికి తాకించాలి. ఈ పోజ్ లో ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మామూలు పొజిషన్ కు రావాలి. ఇలా రెండు నుంచి మూడు సార్లు రిపీట్ చేయాలి. గర్భిణిలు, రుతుస్రావంలో ఉన్న మహిళలు ఈ వ్యాయామం చేయకూడదు.


లాభాలివీ
దీని వల్ల బెల్లీ ఫ్యాట్ దగ్గరున్న కండరాలు బలపడి, ఫ్యాట్ తగ్గుతుంది.
ఈ వ్యాయామంతో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
ఈ పోజ్ వల్ల కీళ్లలో రక్తప్రసరణ కూడా మెరుగుపరచుకోవచ్చు.
ఈ పోజ్ వల్ల పొట్ట లో గ్యాస్ ఉంటే వెంటనే బయటకు వెళ్లిపోతుంది.