సౌత్ సినిమాల వైపు చూస్తున్న బాలీవుడ్ స్టార్లు
ఒకప్పుడు సౌతిండియా సినీ పరిశ్రమ మొత్తం హిందీ సినిమాల మీద ఆధారపడేది. ఇక్కడి దర్శక నిర్మాతలు బాలీవుడ్ సినిమాలు చూసి ఆ స్పూర్తితో ఇక్కడ సినిమాలు తీసేవారు. వారిలో చాలామంది రీమేక్‌లు హిట్ కూడా కొట్టారు. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు సౌతిండియా సినీ పరిశ్రమ రేంజ్ పెరిగింది. ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు మనోళ్లు కూడా తీస్తున్నరు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ నుంచి వచ్చే సినిమాలకు ప్రతి ఒక్కరు నీరాజనాలు పడుతున్నారు. దీంతో బాలీవుడ్ స్టార్స్ కూడా మన తెలుగు సినీ పరిశ్రమతో పాటు సౌత్ సినీ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపుతున్నారు.

తెలుగుతో సహా సౌత్ ఇండస్ట్రీలో బాలీవుడ్ స్టార్స్ అనీల్ కపూర్, అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి వంటి వారు నటించారు. అజయ్ దేవగణ్.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెర మీద కనిపించనున్నాడు. ఇదే సినిమాతో అలియా భట్ కూడా తెలుగు తెరకు పరిచయం అవుతుంది. ఇక అమితాబ్ ముచ్చటకొస్తే.. గతంలో నాగార్జున, నాగేశ్వరరావు, నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన మనం చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా గోసాయి వెంకన్న పాత్రలో నటించారు.

ఇక మున్నాభాయ్ సంజయ్ దత్ .. కేజీఎఫ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న కేజీఎఫ్ ఛాప్టర్ 2లో అధీరా పాత్రలో నటిస్తున్నాడు. అంతకు ముందు సంజు బాబా నాగార్జున హీరోగా నటించిన ‘చంద్రలేఖ’లో కాసేపు తెరపై కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమాతో పాటు బాలయ్య, బోయపాటి శ్రీను, చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో కూడా విలన్‌గా సంజయ్ దత్ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్.. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ షాట్‌గన్ శతృఘ్న సిన్హా కూడా తెలుగు సినిమాలో నటించారు.

జాకీష్రాఫ్ తెలుగులో అస్త్రం, శక్తి, పంజా, సాహో సినిమాల్లో నటించాడు. సాహో సినిమాతో శ్రద్ధా కపూర్ కూడా తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక అనీల్ కపూర్… బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశవృక్షం’లో నటించాడు. ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌కు విలన్‌గా నటిస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. ఖిలాడీ కుమార్ అక్షయ్ కుమార్.. రజనీ సినిమా రోబో 2.ఓ చిత్రంలో పక్షిరాజుగా మెప్పించాడు. మరో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అర్జున్ హీరోగా నటించిన ’రానా’ తో పాటురజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ సినిమాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను మెప్పించాడు.

జితేంద్ర .. కృష్ణ హీరోగా నటించిన దొంగల వేట సినిమాలో అతిథి పాత్ర పోషించి అలరించారు. ఒకప్పటి బాలీవుడ్ అగ్ర నటుడు సంజీవ్ కుమార్.. శారద హీరోయిన్గా తెరకెక్కిన ఊర్వశి చిత్రంలో అతిథి పాత్ర పోషించారు. సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్భాజ్ ఖాన్.. చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ, రాజ్ తరుణ్ హీరోగా నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సినిమాల్లో విలన్‌గా నటించాడు. విద్యుత్ జమ్వాల్.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన శక్తి, ఊసరవెల్లి సినిమాలలో విలన్‌గా నటించాడు. భోజ్‌పురి కమ్ బాలీవుడ్ నటుడు రవికిషన్ శుక్లా రేసుగుర్రం చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో బసిరెడ్డి పాత్రతో పలకరించాడు.
బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ సౌత్ సినిమాలలో నటించడం పక్కన పెడితే అక్కడి దర్శక నిర్మాతలు మన సినిమాలని రీమేక్ చేసి మంచి విజయాలు సాధిస్తున్నారు. సౌత్ సినిమాలపై ఒకప్పుడు అందరిలో చిన్న చూపు ఉండేది. కాని బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాలు సౌత్ ఇండస్ట్రీ సత్తా చాటాయి. మంచి కథలతో, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాలు తీస్తే.. రానున్న రోజులలో తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి మరింత పెరగడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.