పబ్ జీ గేమ్ మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పబ్ జీ గేమ్ కు అలవాటు పడి.. ఆ వ్యసనం నుంచి బయట పడలేక పెద్దలు మందలించినందుకు ఏకంగా ప్రాణాలే తీసుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తేనే ఉన్నాం. తాజాగా వికారాబాద్ జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.
పబ్జీ ఆటకు అలవాటుపడ్డ బాలుడు గేమ్ ఆడుకునేందుకు తండ్రి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన అనంతయ్య, లలితమ్మ దంపతులు కులకచర్ల గేటు వద్ద పండ్లు, పూజా సామగ్రి దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు ఓంకార్(15) పదో తరగతి చదువుతున్నాడు. లాక్ డౌన్ వల్ల బడులు మూతపడి కొద్దికాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓంకార్ స్మార్ట్ ఫోన్లో పబ్జీ గేమ్‌కు అలవాటుపడ్డాడు. పబ్జీ గేమ్ ఆడటం కోసం తనకు కొత్త స్మార్ట్ ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఇప్పుడు డబ్బులు లేవని.. తర్వాత కొనిస్తానని నచ్చజెప్పాడు. గేమ్ ఆడటం మానేసి పూజాస్టోర్ లో చేదోడు వాదోడుగా ఉండాలని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన ఓంకార్ బుధవారం అర్ధరాత్రి చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.